ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు. ఓవైపు అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూర్చోగా..ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల వైపు కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారింది.
అనం రామనారాయణ రెడ్డి.. కొన్నాళ్లుగా వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఘాటుగానే స్పందించింది. ఆయన్ను వెంకటగిరి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో.. నేదురుమల్లి వారసుడిని నియమించింది. అప్పటినుంచి ఆయన మాటలకు ఇంకా పదును పెరిగింది. దీంతో.. ఆయన పార్టీ మారడం ఖాయమనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైపు కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయని.. విలువలు లేకుండా పోయాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, ఎన్నికల అధికారులు సైతం వారి విధులు కూడా సక్రమంగా నిర్వర్తించలేని స్థితికి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు నవ్వులపాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు.