రాష్ట్రంలో హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ విశాఖ జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఈ తరహాలోనే సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించేవారు. తాజాగా, ఫ్లూ వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్నందున బాధితులను గుర్తించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వేకు సిద్ధమైంది. సర్వేలో భాగంగా ఆశ కార్యకర్త, వలంటీర్ ఇంటింటికీ వెళ్లి వైరస్ బాధితులను గుర్తిస్తారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వివరాలను వలంటీర్‌కు ఇచ్చిన యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ వివరాలు ఏఎన్‌ఎం యాప్‌లో కనిపిస్తాయి. వారింటికి ఏఎన్‌ఎం వెళ్లి మరోసారి పరీక్షిస్తారు. రోగి పరిస్థితిని బట్టి అవసరమైన మందులు ఇస్తారు. ఇబ్బందికరంగా వుందంటే స్థానిక మెడికల్ ఆఫీసర్‌కు సమాచారాన్ని అందిస్తారు. ఆయన సలహా మేరకు చికిత్స అందిస్తారు. అవసరం అనుకుంటే బాధితుల నుంచి నమూనాలను సేకరించి కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తారు. పరీక్ష ఫలితాన్ని బట్టి సదరు రోగికి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటారు.