కోడికత్తి కేసులో సీఎం జగన్ ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావాలని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి కేసులో బాధితులతో పాటు సాక్షి కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం కోర్టును మొదటినుంచీ అభ్యర్థిస్తూనే ఉన్నారు. దీనికి తగినట్టుగానే మంగళవారం ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న సీఐఎ్‌సఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్‌ను విచారిస్తున్న సమయంలో న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దినేశ్‌కుమార్ వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత, బాధితుడు, రెండో సాక్షిగా ఉన్న సీఎం జగన్‌ను, మూడో సాక్షిగా ఉన్న ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డిని విచారించాల్సి ఉందని, వారికి కోర్టుకు పిలిపించాలని న్యాయవాది సలీం అభ్యర్థించారు. అంగీకరించిన న్యాయమూర్తి.... జగన్, ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డి ఏప్రిల్ 10న కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడిని తాను ప్రత్యక్షంగా చూడలేదని విమానాశ్రయ సీఐఎ్‌సఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. జగన్‌పై దాడి జరిగిన తరువాత ఆ కత్తిని వైసీపీ నేత చల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి తెచ్చి తనకు ఇచ్చారని స్పష్టం చేశారు. జరిగిన దాడిపై ఫిర్యాదు చేయమని జగన్ తనకు చెప్పలేదని, ఢిల్లీ సీఐఎ్‌సఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సూచనలపై ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేశారు.