స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఇది సంతానోత్పతికి సంబంధించినది కావడంతోపాటు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక చట్టాలు తదితర అంశాలతో ముడిపడి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలా ధర్మాసనం.. చట్టాన్ని కాదని విస్తృత భాష్యం చెప్పాల్సిన ఇటువంటి కేసుల్లో రాజ్యాంగంలోని 145(3) ఆర్టికల్ ప్రకారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 143 ప్రకారం.. రాష్ట్రపతి అధికారాలతోనూ ఈ అంశం ముడిపడి ఉన్నందున సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఒక సంబంధాన్ని చట్టబద్ధం చేయడమనేది శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుందని, ఒకవేళ స్వలింగ వివాహాలను అనుమతిస్తే పిల్లల దత్తతపై ప్రభావం చూపుతోందని కేంద్రం చెబుతోందని వెల్లడించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఆలోగా రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైతే ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపింది.
ఇది సమాజాన్ని ప్రభావితం చేసే విషయం కావడం వల్ల వాదనలను పూర్తిగా వినాలని, సుదీర్ఘ విచారణ కొనసాగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. ఒకే లింగం కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి చట్టబద్ధత కల్పించడమనేది శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుందని, ఇటువంటి వ్యవహారాల్లో దత్తత అంశం చర్చకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుంటే స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకే లింగం వ్యక్తుల ఇష్టపూర్వక లైంగిక సంబంధం క్రిమినల్ కేసుగా పరిగణించడాన్ని గతంలోనే సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైందని, అతను లేదా ఆమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న దానిపై వారికి నియంత్రణ ఉండదని, దానిని అణచివేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.