ఆర్ఆర్ఆర్ చిత్రానికి మనదేశంలోని ప్రముకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే 95 ఆస్కార్ అవార్డుల్లో భారత్ ప్రతిభకు గౌరవం దక్కింది. ఉత్తర డాక్యుమెంటరీ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ఉత్తమ పాట విభాగంలో‘ఆర్ఆర్ఆర్’ల నాటునాటుకు అవార్డులు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్కార్ అవార్డు గ్రహీతలను బృందాలను రాజ్యసభ అభినందనలతో ముంచెత్తింది. ఆస్కార్ వేదికపై భారత్ అవార్డుల ప్రస్థానం మొదలయ్యిందని రాజ్యసభ ఎంపీలు ముక్త కంఠంతో ప్రశంసించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడారు. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డు దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నాటునాటు పాటకు సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిలకు రాజ్యసభ తరఫున ఆయన అభినందనలు తెలిపారు.
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయీకరణకు ఈ అవార్డులు మరింత దోహదపడతాయి.. ఈ విజయాలు విస్తారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత, భారతీయ కళాకారుల నిబద్ధత, అంకితభావానికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన ప్రశంసలు ఇవి.. ఇది భారతీయుల ఎదుగుదల, గుర్తింపునకు నిదర్శనం’’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ రెండు చిత్రాలతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ సభ తరఫున అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రా కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌నూ అభినందించారు. ఈ
ఈ రెండు సినిమాలను పార్లమెంటు సభ్యులు, వారి కుటుంబాల కోసం ప్రదర్శించాలని కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను కోరగా.. ఆయన అంతకంటే అదృష్టం ఇంకేముంటుందని చెబుతూ ఒప్పుకున్నారు. రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ఇద్దరు మహిళలు కలిసి నిర్మించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ఆస్కార్ అవార్డును గెలుపొందడం మన మహిళలకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన గౌరవం.. ఆర్‌ఆర్‌ఆర్ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ సభ సభ్యుడే. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మనమంతా గుర్తించాలి’ అని పేర్కొన్నారు.
అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ.. నాటునాటు తెలుగుపాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికుల మనసుల్లో భారతీయ సంగీత ప్రతిధ్వనిగా మారిందని కితాబిచ్చారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండూ దక్షిణాదికి చెందిన చిత్రాలు కావడం తమకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అయితే, ఈ అవార్డుల క్రెడిట్‌ను అధికార పార్టీ తీసుకోకూడదంటూ చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. ‘భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు రావడం గర్వకారణం.. అయితే, నా విజ్ఞప్తి ఏంటంటే.. అధికార పార్టీ ఈ క్రెడిట్ తీసుకోకూడదు. మేమే దర్శకత్వం వహించాం.. మేమే రాశాం.. ప్రధాని మోదీ దర్శకత్వం వహించారు.. ఇలా అనొద్దు.. అదొక్కటే నా అభ్యర్థన. ఇందులో దేశ సహకారం ఉంది’ అని అన్నారు. ఎస్పీ ఎంపీ, సీనియర్ నటి జయాబచ్చన్ మాట్లాడుతూ... దేశంలోని అత్యంత ముఖ్యమైన రాయబారులు, సినీ రంగంపై చర్చ జరగడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. ఈ చర్చలో 23 మంది సభ్యులు సుమారు 50 నిమిషాలపాటు మాట్లాడారు.