మొన్నటి వరకు కరోనా కారణంగా వణికిన మన దేశంలో తాజాగా ఇన్‌ఫ్లూయెంజా ఏ రకం ఉప-వర్గం హెచ్3ఎన్2 వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏటా సీజనల్‌గా వచ్చే ఈ ఫ్లూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా భిన్నంగా ఉంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా కర్ణాటకలో ఒకరు, హరియాణాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, గుజరాత్‌లో ఫ్లూ వంటి లక్షణాలతో 58 ఏళ్ల మహిళ కన్నుమూసింది. వడోదర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. ఆమె మృతికి హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణమా? అని అధికారులను ప్రశ్నించగా.. నమూనాలను పరీక్షల కోసం పంపామని తెలిపారు. మృతికి స్పష్టమైన కారణాలను రివ్యూ కమిటీ నిర్దారించనుందని సమాధానం చెప్పారు.
వడోదరలోని ఫతేగంజ్‌కు చెందిన 58 ఏళ్ల మహిళ ఫ్లూ అనుమానిత లక్షణాలతో ఓ ప్రయివేట్ ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మార్చి 11న వడోదర సర్ సాయాజీరావ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 13న మృతిచెందిందని ఎస్ఎస్‌జీ హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డీకే హేలయ వెల్లడించారు. ‘‘పరీక్షల కోసం ఆమె నమూనాలను సేకరించి పంపాం.. మృతికి కారణాలను రివ్యూ కమిటీ నిర్దారించనుంది’’ అని ఆమె తెలిపారు.
మరోవైపు, ఈ ఏడాది ఇప్పటి వరకూ తమ రాష్ట్రంలో మూడు హెచ్3ఎన్2 కేసులు నమోదయినట్టు గతవారం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్ పటేల్ వెల్లడించారు. ‘‘ఈ ఏడాదిలో మార్చి 10 వరకూ మొత్తం 80 ఫ్లూ కేసులు గుజరాత్‌లో నమోదయ్యాయి.. ఇందులో 77 ఇన్‌ఫ్లూయెంజా ఉపవర్గం హెచ్1ఎన్1 కాగా.. మూడు హెచ్3ఎన్2 కేసులు.. దీని కారణంగా ఎలాంటి మరణం చోటుచేసుకోలేదు’’ అని ఆరోగ్య మంత్రి తెలిపారు.
మరోవైపు, ఈ కేసులతో పాటు కరోనా వైరస్ పాజిటివిటీ రేటు పలు రాష్ట్రాల్లో పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని ప్రజలకు సూచించింది.