మనదేశంలో గవర్నర్ల వ్యవస్థపై విమర్శలున్న విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ల పోషిస్తోన్న పాత్ర, వారి జోక్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాల పతనానికి కారణమయ్యే రాజకీయ ప్రక్రియలలో వారు భాగమవుతున్నారని వ్యాఖ్యానించింది. శివసేన కేసులో బుధవారం జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
శివసేన తిరుగుబాటుతో అట్టుడుకుతున్న తరుణంలో గతేడాది జూన్ 30న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోవాలన్న అప్పటి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ నిర్ణయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ధర్మాసనంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జిస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలు మాట్లాడుతూ.. తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారమని, కాంగ్రెస్, ఎన్‌సీపీలతో ఏర్పడిన సంకీర్ణ మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) ప్రభుత్వానికి రాజకీయ పార్టీగా సేన మద్దతు ఉపసంహరించుకున్నట్లు సూచించడానికి ఎటువంటి ఆధారం లేదని పేర్కొన్నారు. మాజీ గవర్నర్ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ పరిశీలనను ఈ మేరకు తిరస్కరించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తలెత్తే అసంతృప్తిని ఆధారంగా చేసుకుని గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించడం సరైందికాదని అభిప్రాయపడింది. అటువంటి చర్యతో ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చని తెలిపింది. ఒక నిర్దిష్ట ఫలితాన్ని ప్రభావితం చేసేలా గవర్నర్ కార్యాలయం వ్యవహరించరాదని ‘‘ప్రజాస్వామ్యానికి అది విషాదకర దృశ్యం’’ అవుతుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఠాక్రేను కోరడం ద్వారా ప్రభుత్వం కూలిపోతుందనే స్పృహ గవర్నర్‌కు ఉండాలని తెలిపింది.
‘ఒకవేళ తమ నేత పట్ల శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే ఆయన స్థానంలో మరొకర్ని వారే ఎన్నుకుంటారు. అయితే పార్టీలో విభేదాల కారణంగా సీఎం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని గవర్నర్ చెప్పగలరా?. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సీఎంను అడిగే గవర్నర్‌కు ఉన్న అధికారాన్ని మేం ప్రశ్నించడం లేదు... కానీ సమస్య ఏమిటంటే, ప్రభుత్వ పతనాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో గవర్నర్ భాగం కాకూడదు.. సభలోపల నంబర్ గేమ్‌తో సంబంధం లేకుండా ఉంటుంది’అని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
‘ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్‌సీపీతో పొత్తు పెట్టుకోవడంపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేది గవర్నర్ ముందు ఉన్న ఏకైక కారణం... విశ్వాస పరీక్షకు పిలుపునివ్వడానికి ఇది కారణం కాగలదా?.. ఇది పార్టీని విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటుదారులను వాస్తవంగా అనుమతిస్తుంది.. నంబర్ గేమ్‌లో ఠాక్రే ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా సీఎంను కోరేందుకు గవర్నర్ మెటీరియల్‌కు తగినట్లుగా ఉన్నారు’ అని అభిప్రాయపడింది.