జాతీయ మహిళా కమిషన్ మాధిరిగా పురుషులకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివాహిత మహిళలే కాదు పురుషులు కూడా గృహ హింసకు గురవుతున్నారని, అటువంటి వారికి రక్షణగా ఓ జాతీయ కమిషన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. భార్యల చిత్రహింసల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి రక్షణగా మహిళా కమిషన్ మాదిరిగా జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం.. దేశంలో 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందులో 81,063 మంది వివాహిత పురుషులు, 28,680 మంది మహిళలు ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ తెలిపారు.
కుటుంబ సమస్యల కారణంగా 33.2 శాతం మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 4.8 శాతం మంది వివాహ సంబంధ కారణాలతో చనిపోతున్నారని వివరించారు. 2021లో నమోదయిన ఆత్మహత్యల్లో 1,18,979 (72శాతం) మంది పురుషులని, 45,026 మంది (27శాతం) మహిళలని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పెళ్లైన మగవారి ఆత్మహత్యలు, గృహ హింస కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి కేసులను విచారణకు స్వీకరించేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనరు కోరారు.
‘దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కారణంగా, కుటుంబ ఇబ్బందులతో కష్టాలు పడుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఇవే ఫిర్యాదులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు తీసుకునేలా సూచించాలి’ అని కోరారు. ‘గృహ హింస లేదా కుటుంబ సమస్యలు, వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యపై పరిశోధనకు, జాతీయ కమిషన్ వంటి ఫోరమ్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించడానికి జాతీయ లా కమిషన్‌కు సిఫార్సు చేసేలా ఆదేశాలు జారీచేయాలి’ అని కోరారు.