మొబైల్స్ పోగొట్టుకున్న వారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల కోసం చాట్ బోట్ అనే వెబ్ పోర్టల్‌ను విశాఖ నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో వివిధ చోట్ల సుమారు 200 సెల్ఫోన్లు అపహరించిన వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. యాప్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురై సెల్ఫోన్లు ఎవరి వద్ద ఉన్నాయో పసిగట్టి వారి నుంచి రికవరి చేసినట్టు క్రైం డీసీపీ నాగన్న శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ఫోన్లను బాధితులకు అప్పగించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.