మీడియా మొఘల్‌గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నలుగురికీ విడాకులిచ్చిన ఆయన.. తన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్‌ను ఐదో వివాహం చేసుకున్నారు. ఇరువురికీ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు రూపర్ట్ మర్దోక్ ప్రకటించారు. ఆయన వయసు 92 ఏళ్ల కాగా... ఈ వయసులోనూ పెళ్లిపీటలు ఎక్కడం గమనార్హం. అయితే, ఇదే చివరి వివాహమని పేర్కొన్నారు. ఏడు నెలల కిందటే నాలుగో భార్య జెర్రీ హాల్ నుంచి మార్దోక్ విడాకులు తీసుకుని.. ఐదోసారి పెళ్లి కొడుకు అవుతున్నారు.
నాలుగో భార్య జెర్రీ హాల్, రూపర్ట్ మర్దోక్‌లు గతేడాది ఆగస్టులోనే విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఆన్ లెస్లీ స్మిత్ అనే 66 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణితో ప్రేమలో పడిన ఆయన.. ప్రియురాలి ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మార్చి 17న న్యూయార్క్‌లో రూపక్ మర్దోక్, ఆన్ లెస్లీల ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగిన మర్దోక్.. ‘నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహం అని. బాగుంటుందని ఆశిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మర్దోక్ చెప్పినట్లు పేర్కొంది.
ఇదిలావుంటే శానిఫ్రాన్సిస్కో మాజీ పోలీస్ అధికారిణి అయిన ఆన్ లెస్లీ స్మిత్ భర్త ఓ వ్యాపారవేత్త. మీడియా ఎగ్జిక్యూటివ్, గాయకుడైన ఛెస్టర్ స్మిత్ 14ఏళ్ల కిందట చనిపోయారు. మర్దోక్‌తో కొద్ది నెలల కిందట ప్రేమలో పడిన ఆమె.. పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్ సహా అనేక మీడియా సంస్థలు మర్దోక్‌కు చెందినవే. ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన ఆస్తి 20 బిలియన్ డాలర్లు. న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. తన కంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్.. అమెరికన్ నటి, మోడల్. మర్దోక్ మొదటి భార్య ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రిషియా బుకర్. ఆమెతో 1960వ దశకం చివరిలో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు పిల్లలు.
అనంతరం న్యూస్ రిపోర్టర్ అన్నా మన్‌ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో హాల్‌ను పెళ్లాడిన మర్దోక్.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. తన రెండో భార్య మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో గడపాలని కొత్త జంట భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa