ఏపీలో వచ్చే ఎన్నికలలో వైసీపీకి వచ్చేది ఐదు స్థానాలేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు జోస్యం చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నందుకు.. ప్రజలు తిరిగి ఆ పార్టీకి 23 స్థానాలనే కట్టబెట్టారన్న సీఎం జగన్ కర్మ సిద్ధాంతం నిజమైతే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చేది ఐదు స్థానాలే అన్నారు. టీడీపీ తరఫున గెలిచిన నలుగురిని, జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను అధికార పార్టీలో చేర్చుకున్నారన్నారు. 5 మందిని తమ పార్టీలో చేర్చుకున్నట్లు సిగ్గు లేకుండా చెబుతున్నారని.. ప్రతిపక్ష ఎంపీలను ఒక్కరిని కూడా తమ పార్టీలోకి తీసుకోలేదని.. అందుకే రానున్న ఎన్నికల్లో 25 కు 25 ఎంపీ స్థానాలు ప్రతిపక్ష పార్టీలకే దక్కే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ప్రకారం టీడీపీకి 23మంది సభ్యులు ఉన్నారన్నారు. శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా వైఎస్సార్‌సీపీకి 6 స్థానాలు, ప్రతిపక్ష పార్టీకి ఒక స్థానం దక్కిందన్నారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయా విలువల గురించి జగన్ పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందే అన్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలో చేరిన నలుగురిపై ఎందుకని అనర్హత చర్యలకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు. వై నాట్ 175 అన్న తమ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారని.. చెప్పిన అబద్ధాలను, చేసిన మోసాలను ప్రజలు గ్రహించారన్నారు.
25 లక్షల ఇళ్లను ఉగాది నాటికి పంపిణీ చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించారని.. నాలుగు ఉగాది పండగలు ఇప్పటికే అయిపోయాయన్నారు. ఏ ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్లను ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. 25 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు ఐదు ఇళ్లను మాత్రమే నిర్మించినట్టుగా పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తెలియజేశారన్నారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్పి మహిళలను పచ్చి మోసం చేశారని.. రూపాయికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పి, చేయకపొతే మోసగించినట్లు కాదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు గారిపై దాడి చేసి తిరిగి స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. దాడి ఘటనలో అధికార పార్టీ శాసనసభ్యులు ఎటువంటి తప్పు చేయకపోతే అసెంబ్లీ ఫుటేజ్‌ను విడుదల చేసి ప్రజలకు నిజానిజాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణలోనూ కుంభకోణం జరిగిందని.. చంద్రబాబు అరెస్ట్ ఖాయమంటూ మరి కొంత మంది మంత్రులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణలో ఎటువంటి అవినీతి జరగలేదని.. ఎటువంటి అవినీతి జరగనిదానికే కేసులు నమోదు చేస్తామంటే ఎలా అన్నారు.
ఎటువంటి రుణభారం లేకుండా కేవలం రూపాయి చెల్లిస్తే చాలు టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయినప్పటికీ జగన్ చెప్పిన మాటలకు అతి, గతి లేకుండా పోయిందన్నారు. ఒక్క లబ్ధిదారునికి కూడా ఇంటిని కేటాయించలేదని.. రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వలేదని అన్నారు. లబ్ధిదారుల పేరిట రుణాలు పొందడానికి గతంలో ప్రభుత్వమే బ్యాంకర్లతో చర్చలు జరిపిందని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆ అప్పులను టిడ్కో ఇళ్ల లబ్ధిదారులే వాయిదాల పద్ధతిలో చెల్లించవలసి ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa