ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణంగా భార్యని చంపిన కిరాతక భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 11:51 AM

విశాఖపట్నం నగర పరిధిలోని వేపగుంట సమీపాన గల అప్పన్నపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో గురువారం రాత్రి ఘోరం  జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను కడతేర్చాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళ్ళితే.... అప్పన్నపాలేనికి చెందిన కిలాని శివకు శ్రీదేవి (24)తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. జీవీఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివకు మరో యువతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. అంతేకాకుండా భార్య పక్కన ఉండగానే...శివ ప్రియురాలికి వీడియోకాల్‌ చేసేవాడు. ఆ సమయంలో భార్యను కించపరుస్తూ, చులకనగా మాట్లాడేవాడు. దీంతో పాటు మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆమె వీటిని భరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శివ పైశాచికత్వం మరింత ముదిరి ఇటీవల విడాకులు ఇవ్వాల్సిందిగా భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆమె విషయాన్ని తన పుట్టింటి వారికి తెలియజేసింది. వారు బంధువుల సాయంతో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విడాకులు ఇవ్వకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివ పగతో రగిలిపోయాడు. భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మహిళలు ధరించే దుస్తులు కొనుగోలు చేసి ఇంటికి వచ్చాడు. తన కోసమే  భర్త వాటిని తెచ్చాడని శ్రీదేవి భావించింది. అదే సమయంలో ప్రియురాలికి వీడియోకాల్‌ చేసిన శివ...దుస్తులు నీ కోసమే తెచ్చానని, తన భార్యకు అవి వేసుకునే సీన్‌ లేదంటూ దెప్పి పొడిచాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. అదే సమయంలో తనకు విడాకులు ఇవ్వాలంటూ ఆమెను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. అయితే చచ్చిపో అంటూ మంచంపైకి ఆమెను నెట్టి దిండుతో ముఖం మీద అదిమిపెట్టి ఊపిరాడనీయకుండా చేసి చంపేశాడు. భార్య పుట్టింటికి ఫోన్‌ చేసి శ్రీదేవికి ఆరోగ్యం బాగాలేదని, వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. వారు వచ్చి ఆమెను ఆస్పత్రి తరలించడంతో అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa