మద్యం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని వాదించే వారు నేటి సమాజంలో లేకపోలేదు కానీ ఈ వ్యసనంతో నష్టాలు ఎక్కువ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ హెచ్చరిక ప్రతీ మద్యం సీసా లేబుల్ పై ముద్రించి ఉంటుంది. అదే మాదిరి పొగాకు ఉత్పత్తులపైనా ఇదే విధమైన హెచ్చరిక ఉంటుంది. కానీ, ఈ హెచ్చరికతో అలవాటు మానుకునే వారు అరుదే. కరోనా సమయంలో వైన్స్ షాపుల ముందు మద్యం ప్రియులు క్యూ కట్టడమే దీనికి నిదర్శనం. ఏటా మార్చి 27వ తేదీని విస్కీడేగా నిర్వహిస్తుంటారు. దీంతో విస్కీ వల్ల లాభ నష్టాలు ఏంటన్నది తెలుసుకుందాం.
విస్కీ, బీర్ పై ఎన్నో రచనలు చేసిన ఇంగ్లిష్ రచయిత మైఖేల్ జాక్సన్ కు గుర్తుగా 2009లో నార్తర్న్ నెదర్లాండ్స్ విస్కీ ఫెస్టివల్ లో ప్రపంచ విస్కీ దినోత్సవాన్ని ప్రకటించారు. మన దేశంలోనూ విస్కీ ప్రియులు చాలా మందే ఉన్నారు. కనుక విస్కీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవాల్సిందే.
గుండెకు ఆరోగ్యం
బార్లీ గింజలను పులియబెట్టి విస్కీని తయారు చేస్తారు. ఇందులో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. విస్కీలో పాలీఫెనాల్స్ అధిక స్థాయిలో ఉంటాయని పలు అధ్యయనాలు చెప్పాయి. పాలీఫెనాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్లు. కనుక ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పాలీఫెనాల్స్ అధికంగా ఉండడం, ప్లాంట్ ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లతో గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని వెబ్ మెడ్ సంస్థ చెబుతోంది. పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ట్రై గ్లిజరైడ్స్ ను కూడా తగ్గిస్తాయి.
జలుబు
విస్కీని మోస్తరుగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. దీంతో జలుబు తగ్గుతుందని పేర్కొన్నాయి.
కాలేయానికి ముప్పు
విస్కీతో లాభం అన్నది చాలా పరిమితంగా తీసుకున్నప్పుడే. అది కూడా రోజులో 30 ఎంఎల్ మించకూడదు. అదే అప్పుడప్పుడు తీసుకునే వారు అయితే 60 ఎంఎల్ మించనప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు నిపుణుల అభిప్రాయం. కానీ, పరిమితికి మించి తాగితే కాలేయం జబ్బులు, కేన్సర్ రిస్క్ పొంచి ఉన్నట్టే. మద్యపానం తరచుగా, అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వులు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. అంతిమంగా అది కాలేయ వైఫల్యానికి దారితీస్తుందని వెబ్ మెడ్ సంస్థ హెచ్చరిస్తోంది.
విస్కీని రోజువారీ తీసుకోవడం వల్ల నోరు, కాలేయం, అన్న వాహిక, కొలన్, పాంక్రియాస్ కేన్సర్ల రిస్క్ పెరుగుతుంది. మహిళలకు ఈ అలవాటు ఉంటే అది వారి గర్భధారణ, ఆరోగ్యంపై హానికారక ప్రభావం చూపిస్తుంది.