ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవయవదానానికి ముందుకు రావాలి.... మన్ కీ బాత్‌లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 27, 2023, 08:11 PM

ప్రతి ఒక్కరూ అవయవదానికి ముందుకు రావాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ 40 రోజుల కుమార్తె అబాబత్ కౌర్ అవయవాలను దానం చేసిన.. అమృత్‌సర్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధుతో దీని గురించి చర్చించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో సుఖ్‌బీర్ సింగ్ సంధుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. సుఖ్‌బీర్ సింగ్ సంధు కుటుంబ సభ్యులందరికీ ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు.


'ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పే ముందు.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 40 రోజుల బాలిక అబాబత్ కౌర్ సంధు.. మరో రోగికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా. అబాబత్ కౌర్ అక్టోబర్ 28న జన్మించింది. కానీ.. తన తల్లి చేయి పట్టుకుని 40 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ లోకానికి వీడ్కోలు పలికింది. సుఖ్‌బీర్ సింగ్ సంధు, సుప్రీత్ కౌర్ తమ పాపను చికిత్స కోసం నవంబర్ 25న PGI కి తీసుకువచ్చారు. అయితే.. ఆ పాప మెదడులో సమస్య ఉందని.. బిడ్డ బతకడం కష్టమని వైద్యులు చెప్పారు' అని ప్రధాని మోదీ వివరించారు.


'ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. అబాబత్ కౌర్ రెండు కిడ్నీలు దానం చేశారు. మార్పిడి సమయంలో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ.. ఆధునిక వైద్య విజ్ఞాన యుగంలో ఆ సమస్యను అధిగమించారు. అవయవ దానం చేశారు. అవయవ దానం వేరే వారికి ప్రాణం పోయడానికి ఉపయోగపడింది. ఇలా ఒక వ్యక్తి మరణానంతరం తన అవయవాలను దానం చేస్తే.. 8 నుంచి 9 మందికి కొత్త జీవితం లభించే అవకాశం ఉంటుంది' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


ప్రస్తుతం దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతుండడం సంతృప్తిని కలిగించే విషయమని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 2013లో మన దేశంలో అవయవ దానం చేసేవారు 5 వేల లోపే ఉండేవారు. కానీ.. 2022 సంవత్సరంలో ఈ సంఖ్య 15 వేలకు పైగా పెరిగింది. అవయవ దానం చేసిన వ్యక్తులు, వారి కుటుంబాలు నిజంగా గొప్ప పని చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com