మనదేశ జాతీయ పతాకాన్ని లండన్ లో అవమానించిన సానుభూతిపరులు తాజాగా అమెరికాలో మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం నిరసన చేపట్టిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ లలిత్ ఝాపై భౌతిక దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్టు తిట్టి వేధించారు. ఈ ఘటనను భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారుల బారి నుంచి లలిత్ ఝాను అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులు రక్షించడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు. తనకు రక్షణ కల్పించిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఖలీస్థాన్ మద్దతుదారులు కర్రలతో దాడిచేశారని, ఎడమ చెవికి గాయమైందని జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
‘‘నా విధులు నిర్వహించడంలో సహకరించి, రక్షణగా నిలిచిన సీక్రెట్ సర్వీస్‌కు ధన్యవాదాలు.. ప్రస్తుతం నేను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాను.. ఈ రెండు కర్రలతోనే ఓ వ్యక్తి దాడిచేశారు.. వారి దాడి నుంచి బయటపడటానికి పోలీసులకు ఫోన్ చేయగానే స్పందించారు.. ఒక సమయంలో నేను చాలా భయపడిపోయి. 911కి కాల్ చేశాను... సీక్రెట్ సర్వీస్ అధికారులను గుర్తించి జరిగిన సంఘటన వారికి వివరించాను’’ అని ఝా ట్వీట్ చేశారు. అయితే తనను వేధించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సదరు జర్నలిస్టు నిర్ణయించుకున్నారు.
‘పోలీసుల నుంచి తప్పించుకున్న అమృతపాల్ సింగ్‌కి మద్దతుగా అతడి సానుభూతిపరులు ఖలిస్థాన్ జెండాలతో సీక్రెట్ సర్వీస్ సమక్షంలోనే రాయబార కార్యాలయం వద్దకు వచ్చారు.. రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు.. భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధును బెదిరించారు’అని ఝా ఏఎన్ఐ వార్తా సంస్థకి చెప్పారు.
నిరసనకారులలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన అన్ని వయసుల వ్యక్తులు ఉన్నారు. వారంతగా వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, వర్జీనియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంగ్లీషు, పంజాబీలో భారతదేశ వ్యతిరేక ప్రసంగాలు చేయడానికి మైక్రోఫోన్‌లను ఉపయోగించారు. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై పంజాబ్ పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు.
మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ జర్నలిస్ట్‌పై హేయమైన దాడిని ఖండిస్తున్నాం.. ‘ఖలిస్థానీ నిరసనకారులు’ అని పిలవబడే వారి హింసాత్మక, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించం’ అని పేర్కొంది. మరోవైపు, పరారీలో ఉన్నఅమృత్‌పాల్ సింగ్‌కు సిక్కులకు అత్యంత పవిత్రమైన ‘అకాల్ తక్త్’ నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే లొంగిపోవాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa