కొంగను కాపాడిన వ్యక్తికి అటవీశాఖ అధికార్లు నోటీసులు జారీ చేశారు. ఇదిలావుంటే కొంగతో స్నేహం చేస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి ఆరిఫ్ గురించి మీకు తెలుసు కదా. గాయపడి పొలంలో పడిపోయిన ఉన్న కొంగను ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేయగా.. అది కోలుకుంది. అప్పటి నుంచి ఏడాదిపాటు అతడి దగ్గరే అది ఉండిపోయింది. అతడు ఎక్కడికి వెళ్తే.. అది కూడా అక్కడికి ఎగురుకుంటూ వెళ్లడంతో.. ఆరిఫ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఆ కొంగను అతడు బచ్చా అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు. తన ఇంట్లో ఒకడిగా ఆ కొంగ కలిసిపోయింది.
కానీ ఆ కొంగ అరుదైన వన్యప్రాణి కావడంతో.. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి మార్చి 21న ఆ కొంగను పట్టుకొని పోయారు. రాయ్‌బరేలీలోని సమస్‌పూర్ శాంక్చు్యరీకి దాన్ని తరలించారు. అక్కడి సహజ వాతావరణంలో అది నివసిస్తుందని అటవీ అధికారులు తెలిపారు.
బచ్చా తనకు దూరం కావడంతో ఆరిఫ్ బాధపడ్డాడు. కానీ చట్టం ప్రకారం అటవీ శాఖ అధికారులకు సహకరించాడు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ.. కొంగను కాపాడి, ఏడాదిపాటు దాని బాగోగులు చూసిన ఆరిఫ్‌పై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి తమ ఆఫీసుకు రావాలని గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అరిఫ్ ఖాన్‌కు నోటీసులు జారీ చేశారు.
అసిస్టెంట్ డీఎఫ్‌వో రణ్‌వీర్ సింగ్ ఇచ్చిన నోటీసుల ప్రకారం.. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆరిఫ్‌పై కేసు నమోదు చేశారు. ఆరిఫ్ దగ్గర్నుంచి కొంగను తీసుకెళ్లిన మరుసటి రోజు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి మీర అటవీ శాఖ అధికారుల చర్యను ఖండించారు. ప్రధాని నివాసంలోని నెమళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లే దమ్ముందా అని ఫారెస్ట్ అధికారులను ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఆరిఫ్ ఖాన్ సైతం అఖిలేష్ పక్కనే కూర్చున్నప్పటికీ ఏమీ మాట్లాడలేదు.
కొంగతో ఆరిఫ్ స్నేహానికి సంబంధించి ఇటీవల వీడియోలు వైరల్ అయిన సమయంలో అఖిలేష్ యాదవ్ అతడి ఇంటికి వెళ్లారు. బచ్చా, అరిఫ్‌తో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణల పట్ల డీఎఫ్‌వో డీఎన్ సింగ్ స్పందించారు. ఆరిఫ్ సమ్మతి ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సారస్ కొంగలు ఎప్పుడూ జంటగా నివసిస్తాయి. కానీ ఇది మాత్రమే ఒంటరిగా ఉంటోంది. దీంతో దాని క్షేమం గురించి ఆందోళన ఉండేదని అన్నారు.