ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తెలిసిందే. అయితే, తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేసినప్పటికీ కుట్రపూరితంగా తనను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపిస్తున్నారు. తాము డబ్బుకు అమ్ముడుపోయామని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరైనా నిరూపిస్తే వారికి రూ. 40 కోట్లు ఇస్తానని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో తన తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, వైసీపీ శ్రేణులు ఆమెను పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడంపై ఉండవల్లి శ్రీదేవి కూతురు భవ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్టానం నలుగురిని సస్పెండ్ చేస్తే కేవలం తన తల్లిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. దళిత మహిళ అని, ఆమె వెనక ఎవరూ లేరని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు మీడియాతో భవ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉండవల్లి శ్రీదేవి భేటీ అయ్యారని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని చెప్పారు. అప్పుడు సీఎం జగన్ తన తల్లితో పాటు తనతో కూడా చాలా బాగా మాట్లాడారని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా బాగా మాట్లాడారని తెలిపారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సీటు గురించి, తనపై వస్తున్న ఆరోపణల గురించి సీఎం జగన్‌కు ఎమ్మెల్యే శ్రీదేవి వివరించే ప్రయత్నం చేశారని భవ్య తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని, తనను నమ్ముకుంటే అంత కంటే మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో సీఎం జగన్‌పై నమ్మకంతో వెళ్లి ఓటు వేస్తానని చెప్పి తన తల్లి వెళ్లి వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారని తెలిపారు.
కానీ, ఇన్ని రోజులు తమను బాగా జాగ్రతగా చూసుకున్న సీఎం జగన్.. అసలు ఆధారాలు లేకుండా తన తల్లి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారని ఎలా నమ్మరో అర్థం కావడం లేదంటూ భవ్య చెప్పారు. త తల్లి తప్పు చేయకపోయినా చేసిందని ఆరోపిస్తున్నారని.. కనీసం మీరు చేశారా అన్న ప్రశ్న కూడా అడగకుండా, తాను ఏం చెప్తుందో వినకుండా నువ్వే చేశావ్ అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితురాలు, మహిళ అనే సంగతి కూడా పక్కన పెడితే.. మొదట తన తల్లి ఒక మనిషి కూడా చూడకుండా చాలా దారుణంగా తిడుతున్నారని వాపోయారు.
తన చెల్లి ఇంటర్మీడియట్ చదువుతోందని.. ఆమె పరీక్ష రాయకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తోందని భవ్య తెలిపారు. బయటకు వెళితే ఎవరు ఏమంటారో అనే భయంతో తన చెల్లి ఇంట్లో కూర్చుందన్నారు. మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్స్ అని, తాను కూడా డాక్టర్ చదువుతున్నానని.. భవిష్యత్తులో తన చెల్లి కూడా డాక్టర్ అవుతుందన్నారు. ‘‘బాగా చదువు ఉన్న కుటుంబం, బాగా సెటిల్ అయిన వాళ్లం.. అందుకే కదా మాకు ఎమ్మెల్యే సీటు సీటు ఇచ్చింది. అలాంటిది మా అమ్మ ఎందుకు రూ. 10 కోట్ల కోసం అలా చేస్తుంది. అయినా, మా వాల్యూ ఇంతేనా.. రూ. 10 కోట్లు అంటే మాకు పెద్ద విషయం కూడా కాదు. మరీ ఇంత తక్కువగా రూ. 10 కోట్లు తీసుకున్నామని కాకుండా, ఓ రూ. 150 కోట్లు తీసుకున్నామని ఆరోపించినా బాగుండేది, మరీ మా విలువ రూ. పది కోట్లేనా.. ఈసారి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఇంకాస్త వినూత్నంగా ఆలోచించండి.’’ అని భవ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.