ఈ వేసవిలో తిరుమల కు వెళ్లే భక్తులకు శుభవార్త. మరో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఈఐఎల్ ఆధ్వర్యంలోని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 10 ఎలక్ట్రిక్ బస్సులు మొదటి విడతలో అందజేశారు.. ఈ బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. స్థానిక టీడీడీ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి చేరుకున్న బస్సులను తిరుమల ట్రాఫిక్ డీఐ జానకిరామిరెడ్డి పర్యవేక్షించారు. ఈ 10 బస్సుల్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమలలో వాతావరణ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా టీటీడీ ఈ బస్సుల్ని తీసుకొచ్చింది.
తిరుమలలో ధర్మ రథం కింద ఈ బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం తిరుమల కొండపై 12 వరకు ఉచిత ధర్మరథం బస్సులు ఉన్నాయి.. వాటి స్థానంలోనే ఈ పది ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ధర్మరథం బస్సులు తిరుపతిలో ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ బస్సుల్ని మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అందజేస్తోంది. అంతేకాదు ఈ బస్సుల్ని టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ బస్సులో 23 సీట్లు ఉంటాయి.. అదనంగా కొంత స్టాండింగ్ ఏరియా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బస్సుల్లో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డ్‌లు ఉన్నాయి.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు డిస్‌ప్లేలో తెలియజేస్తుంది. అలాగే తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపేలా ఫోటోలను బస్సుపై ఉన్నాయి. ఈ బస్సులకు రెండు వైపుల ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు ఆటోమెటిక్ తలుపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తిరుమలకు తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సుల తరహాలో వీటిని తీర్చిదిద్దారు. సీసీ కెమెరాలు, అనౌన్స్‌మెంట్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
మరోవైపు ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 100 బస్సులు కేటాయించగా.. గతంలో 82 బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. 50 బస్సులు తిరుమల-తిరుపతి కనుమ దారిలో.. మరో 14 బస్సులు రేణిగుంట విమానాశ్రయం- తిరుమల మధ్య నడుస్తున్నాయి. మిగిలిన బస్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటూ ఇతర కారణాలతో డిపోకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఎంఈఐఎల్ అందజేసిన మరో 10 బస్సులు కొండపై భక్తల కోసం థర్మ రథాలుగా అందుబాటులోకి రావడంతో.. భక్తులు ఈ వేసవికాలంలో ఏసీ బస్సుల్లో తిరుమలలో హాయిగా తిరగొచ్చు.