మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో పాత అధికారి కూడా కొనసాగుతారని స్పష్టంచేసింది. అదనంగా మరో అధికారిని నియమించడం ద్వారా దర్యాప్తును, విచారణ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాన్ని చెయ్యాలని హితవు పలికింది. దర్యాప్తు పురోగతిపై సీబీఐ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తులో పురోగతి లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఆ కేసులో ఐదో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘దర్యాప్తు స్థితిపై గతంలో ఇచ్చిన నివేదిక మా వద్ద ఉంది. దానికి, తాజాగా సమర్పించిన నివేదికకు ఎలాంటి వ్యత్యాసం లేదు. అందులో పేర్కొన్న అంశాలే ఇందులోనూ ఉన్నాయి’ అని ఆక్షేపించింది. దర్యాప్తు అధికారిని మార్చాల్సిందిగా సీబీఐ డైరెక్టర్‌కు చెప్పాలని పేర్కొంది.