ఐసిడిఎస్ ప్రాజెక్టు వేటపాలెం సెక్టార్ 1 నందు మంగళవారం పోషణ్ పక్వాడ కార్యక్రమం జరిగింది. సూపర్వైజర్ బట్ట పుష్పవల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు శిశువులకు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రక్తహీనత లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే గృహ సందర్శనలు చేసి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయో కూడా గమనించి వారికి సత్వర సేవలు అందించాలన్నారు. గర్భిణీ మొదలైన నాటి నుండి బిడ్డలు జన్మించే 24 నెలల కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారని, ఈ సమయంలో వారికి పోషక విలువలు ఉన్న ఆహారం తప్పనిసరిగా ఇవ్వడం అవసరమని పుష్పవల్లి చెప్పారు. అంతేకాక అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న జీరో నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల ఎత్తు బరువులు కూడా కొలిచారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ కల్పన, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.