మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో చైర్మన్ రామోజీరావుకు సీఐడీ నోటీసు జారీచేసింది. ఆయన కోడలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు సైతం గుంటూరు సీఐడీ అధికారులు తాఖీదులు ఇచ్చారు. సీఆర్‌పీసీ 160కింద ఇచ్చిన ఈ నోటీసుల్లో ఈ నెల 29 లేదా 31న గానీ... ఏప్రిల్ 3లేదా 6న గానీ విచారణకు రావాలని కోరారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావడానికి కుదరకపోతే తామే రామోజీ ఇంటికి వచ్చేందుకు దర్యాప్తు అధికారులు ఆ నోటీసుల్లో సంసిద్ధత వ్యక్తంచేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మార్గదర్శి కార్యాలయాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు జిల్లాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఉల్లంఘించిందంటూ.. ఐపీసీ సెక్షన్ 120(బి), 409, 420, 477(ఏ) రెడ్ విత్ 34, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లి్‌షమెంట్ యాక్ట్‌తోపాటు చిట్ సెక్షన్లు 76, 79కింద అభియోగాలు మోపింది. ఇదిలాఉండగా, ఇటీవల విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం తదితర ప్రాంతాల్లోని మార్గదర్శి కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు మేనేజర్లను అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ... నోటీసులు పంపించింది. ఇటీవల సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా కొన్ని ధ్రువీకరణల కోసం ప్రశ్నించే అవకాశం ఉంది.