న్యాయ వ్యవస్థలో భారతీయ భాషలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల జరిగిన ఓ సదస్సులో చర్చకు వచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయ వ్యవస్థలో తెలుగు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు విషయంలో దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా సీజే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు భాష అమలు చేసేందుకు తీసుకున్న చర్యలపై అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రభుత్వం జారీచేసే జీవోలను తెలుగులో ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, తెలుగు భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలుచేయాలని కోరుతూ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకురాగా పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది శ్రేయా్‌సరెడ్డి స్పందిస్తూ.. తెలుగు భాషను అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.