తనకూ టీడీపీ నుంచి ఆపర్ వచ్చిందని నందికొట్కూర్ ఎమ్మెల్యే అర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పొలిటికల్ హీట్ ఇంకా తగ్గలేదు. నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేయడం.. ఆ వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కోసం తమను టీడీపీ ప్రలోభ పెట్టిందని మీడియా ముందుకు రావడం సంచలనంరేపింది. ముందు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చారని చెబితే.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా టీడీపీ నేతలు తనను సంప్రదించినట్లు చెప్పారు. తన కాల్ హిస్టరీతో సహా మీడియా ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే మరో ఎమ్మెల్యే తనకు టీడీపీ ఆఫర్ ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తనకూ ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. ముందు తన కుమారుడికి ఫోన్ చేశారని.. 'మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు వారికి చెప్పినట్లు' వివరించారు. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో తన ఇంటి దగ్గర కలవాలని ప్రయత్నించారన్నారు.
ముందు వ్యక్తిగతంగా మాట్లాడాలని గన్‌మెన్‌ను కొందరు సంప్రదించారని.. గన్ మెన్ ఫోన్‌లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ దగ్గర చిన్న ఉంది.. పర్సనల్‌గా మాట్లాడాలని తనతో చెప్పారన్నారు. ఈ సమయంలో వద్దు.. ఉదయాన్నే రమ్మని వారితో చెప్పానన్నారు. అక్కడితో ఆగకుండా ఓటు వేసే ముందు కూడా తనకు ఫోన్ చేశారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానినట్లు చెప్పుకొచ్చారు.
తనతో పర్సనల్‌గా మాట్లాడాలని అవతలి వ్యక్తి అంటే.. 'మీ ఆటలన్నీ నాకు తెలుసు' అంటూ వారిని హెచ్చరించానన్నారు. ఒకవేళ తన ముందు రూ.200 కోట్లు ఓవైపు.. వైఎస్ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను జగన్ ఫోటోనే తీసుకుంటాను అన్నారు ఆర్థర్. తాను అలా డబ్బుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని.. జగన్‌తో తన ప్రయాణం కొనసాగుతుంది అన్నారు. ఇలా రోజుకో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందంటూ మీడియా ముందుకు రావడం ఆసక్తికరంగా మారిది.
ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడు స్థానాలకు ఎనిమిదిమంది పోటీపడ్డారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి ఆరుగు.. టీడీపీ నుంచి ఒకరు విజయం సాధించారు. అయితే టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారంటూ వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.