సంచలన వ్యాఖ్యలకు మారు పేరు జే.సీ.దివాకర్ రెడ్డి. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేమన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఓటర్ల నాడి పట్టలేకపోతున్నారని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పగలమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అమ్మ, ఆలి, అక్క వంటి పదాలు గ్రామాల్లో వినేవాళ్లమని.. ఇప్పుడు అసెంబ్లీలో వినాల్సి వస్తోందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని.. లోకేష్ పాదయాత్రలో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు.
ప్రజలు రోడ్డుపైకి రావడానికి సిద్ధమయ్యారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీడీపీ స్వీప్ చేసిందన్నారు. జగన్‌పై ఉన్న వ్యతిరేకత ఇలా బయటపడిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కూడా.. ఆ నలుగురు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారన్నారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రక్షణ లేదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ టీడీపీ కార్యక్రమంలో కనిపించారు.
మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో లోకేష్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు లోకేష్‌ను రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు కలిశారు.. తమ సమస్యలను విన్నవించారు. బ్రాహ్మణ సమాజంలో పేదరికాన్ని గుర్తించి దేశంలోనే తొలిసారిగా 2014 ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామన్నారు లోకేష్. రూ.300 కోట్ల రూపాయలు కేటాయించారని.. పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం భారతి విద్యాపథకం, గాయత్రి విద్యాప్రశక్తి పథకం, వశిష్ట విద్యాపథకం, ద్రోణాచార్య పథకాలను అమలుచేసి పోటీపరీక్షలకు శిక్షణ కూడా ఇప్పించామన్నారు.
చాణుక్య పథకం ద్వారా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు ఆర్థికసాయం కూడా అందించామన్నారు. గరుడ పథకం ద్వారా పేద బ్రాహ్మణులు మరణించినపుడు అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేలు అందజేశామన్నారు. కనీస మానవత్వం లేని ఈ ప్రభుత్వం రెడ్డి చివరకు పేదబ్రాహ్మణులు గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించిన పథకాన్ని కూడా రద్దుచేశారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని. గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్దరిస్తామన్నారు. పేద బ్రాహ్మణులకోసం ఇళ్లస్థలాలు కేటాయించి పక్కాగృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే లోకేష్‌ను సత్యసాయిజిల్లా పట్టు రైతుల సంఘం ప్రతినిధులు కలిశారు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. టీడీపీ పాలనలో పట్టు రైతులకు బైఓల్టీన్ పట్టుగూడులకు కిలోకు రూ.50ప్రోత్సాహకాలిచ్చామన్నారు లోకేష్. రైతులకు డ్రిప్, సబ్సిడీమీద షెడ్లు, షెడ్లకు కావాల్సిన డిసిన్ఫెక్షన్స్, మొక్కలపై సబ్సిడీలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలపై అందించామన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. పట్టురైతులకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు ఇప్పిస్తామన్నారు. పట్టు రైతులకు గతంలో అమలు చేసిన పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు.
లోకేష్‌ను సోమందేపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో చేనేత, మరమగ్గాల కార్మికులుకలిసి సమస్యలు విన్నవించారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా చేనేతరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు లోకేష్. గత నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో చేనేతల సంక్షేమానికి ఉదారంగా సాయం అందజేయకపోగా, వివిధరకాల సాకులతో చేనేతల రేషన్ కార్డులు, పథకాలు రద్దుచేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు రూ.110 కోట్లమేర చేనేతల రుణాలను మాఫీ చేశామన్నారు. చేనేతలకు 50ఏళ్లకే పెన్షన్, ముడిసరుకు రాయితీలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుకు కృషిచేస్తామని.. అవసరమైతే రాష్ట్రప్రభుత్వమే భరించేలా చేస్తామన్నారు.