రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పై అనర్హతవేటు అంశం దేశంలో రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో లోక్‌సభలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారంపై చర్చ జరుగుతున్న వేళ.. మరో ఎంపీపై అనర్హత వేటును ఉపసంహరించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ పై ఉన్న అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైజల్ అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్ వచ్చింది.
మహ్హద్ ఫైజల్ 2009లో కాంగ్రెస్ నేత మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 10న కవరత్తీ సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జనవరి 13న ఫైజల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఫైజల్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేసింది. అయితే హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చినా ఫైజల్‌పై అనర్హత ఉపసంహరించలేదు.
ఫైజల్ ఆ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన అనర్హతను లోక్‌సభ సచివాలయం ఎత్తివేయలేదన్నారు. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.. ఇంతలోనే ఫైజల్ అనర్హతను ఎత్తివేస్తూ ప్రకటన విడుదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. రాహుల్ అనర్హతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. ఇదే సమయంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఈ క్రమంలో రాహుల్.. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో అని ఘాటుగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత గుజరాత్‌లోని సూరత్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు విచారణ జరిపి.. నాలుగేళ్ల తర్వాత దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రాహుల్ ఉన్నత న్యాయస్థానంలో అపీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీపై ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951 ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ వెంటనే ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని.. రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్ కమిటీ తొలగింపు నోటీసు ఇచ్చింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో బంగ్లాను ఖాళీ చేయాలన్నారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.