ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి, ఆశించిన ఫలితాలు సాధించడానికి తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని వరల్డ్ బ్యాంక్ భారత విభాగం డైరెక్టర్ ఆగస్టె స్నో కౌమే తెలిపారు. 2021 జూలై నుంచి 2026 జూన్ వరకు రాష్ట్రంలో విద్యారంగానికి సహకారమందించే ‘సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (సాల్ట్) ప్రాజెక్టు అమలు తీరును పర్యవేక్షించడానికి ఆయన నేతృత్వంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడింది. పర్యటన ముగిసిన తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా సాల్ట్ కార్యక్రమం అమలులో పురోగతి గురించి పాఠశాల విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ వివరించారు.