దేవుడి ఆస్తులకు రక్షణగా ఉండాల్సినవారే భక్షకులుగా తయారయ్యారని దేవాలయాల ఆస్తులను కాపాడే వారు లేకుండా పోయారు అని హైకోర్టు మండిపడింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై...భూములను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ దేవదాయశాఖ అధికారులు పాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. గుంటూరులోని కంచికామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం భూమిపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా 22(ఎ) నుంచి సంబంధిత భూమిని తొలగించాలని దేవదాయ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పరిధి లేదని తెలిసి కూడా ఆదేశాలు ఇచ్చారని, ఇలాంటి అధికారిని దేవదాయ కమిషనర్‌గా కొనసాగించడమంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కమిషనర్‌గా కొనసాగే అర్హత ఆ అధికారికి లేదని పేర్కొంది. ఏడాదిగా రాష్ట్రంలోని పరిస్థితులు గమనిస్తున్నామని, దేవాలయాల ఆస్తులను కాపాడేవారే కరువయ్యారని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ఆస్తులు తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం కమిషనర్‌కు లేదని తేల్చిచెప్పింది.