గంజాయి తరలిస్తున్న యువకులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ మూర్తి తెలిపారు. పెంటపాడు ఎస్‌ఐ సత్యనారాయణకు సమాచారం రావడంతో తహసీల్దార్ గంధం వెంకటశేషగిరితో కలిసి అలంపురం జాతీయ రహదారి జంక్షన్ వద్ద నిఘాపెట్టారు. అక్కడ గంజాయి బ్యాగ్‌లతో ఉన్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎస్‌ఐ తన సిబ్బంది సహాయంతో వారిని వెంబడించి పట్టుకుని వారి నుంచి నుంచి 22.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మానుకొండ రాజేష్, భీమవరం పట్టణానికి చెందిన ఇంజమూరి వినయ్ గాడ్లి, గణపవరం మండలం జల్లికాకినాడకు చెందిన మల్లుల వెంకటేశ్వరావు, మరో బాలుడు ఉన్నారన్నారు. వీరందరూ విశాఖపట్నం జిల్లా రైల్వే గూడ్స్ వాగన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని, బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డ్‌కి తరలించామన్నారు.