కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలనే మంగళగిరి ఎయిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ను తొలగించడం జరిగిందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఎయిమ్స్ లో తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్ ను తిరిగి పనిలోకి తీసుకోవాలని కోరుతూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదవ రోజు చేరాయి.
దీక్షా శిబిరాన్ని రామారావు సందర్శించి మద్దతు తెలియజేశారు. దీక్షా శిబిరాన్ని సిఐటియు పట్టణ కార్యదర్శి వై కమలాకర్ ప్రారంభించారు. రామారావు తన ప్రసంగానికి కొనసాగిస్తూ నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ను తొలగించడం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్న ఎయిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ను తొలగింపు చర్య ఖండిస్తున్నామని అన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా రోడ్డున పడేయడం దారుణమైన అన్నారు. దీన్నిబట్టి మోడీ ప్రభుత్వ విధానం కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి అర్థమవుతుందని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన అన్ని నిత్యవసర వస్తువులు ధరలు పెరుగుతాయని అన్నారు.
సెక్యూరిటీ గార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ చెంగయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమస్య గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. దీక్షలో కే. శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, పి. శ్యాంప్రసాద్, ఎస్. శివయ్య, జి. వేణు పాల్గొన్నారు. సెక్యూరిటీ అసోసియేషన్ నాయకులు కోటేశ్వరరావు, శివశంకర్, సాంబశివరావు, రంగారావు, వెంకటేశ్వరావు, బుజ్జి బాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.