ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఘాటు విమర్శలుచేశారు. వైఎస్సార్సీపీకి చెందిన నేతలు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తూ.. డబ్బులు దండుకుంటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నా ఆయన.. ఇసుక టిప్పర్ల ముందు నిల్చొని సెల్ఫీలు దిగారు. వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. నారా లోకేశ్ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
'ఇసుక బంగారమాయనే.. బెంగళూరు పోయేనే. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఇసుక దందాకు ఇదే నిదర్శనం. ఒకేసారి తొమ్మిది ఇసుక టిప్పర్లలో ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారు. పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్.. కానీ చిత్రావతిలో ఆధిపత్యం మొత్తం కేతిరెడ్డిదే. నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకుని ఇసుకను దోచుకుంటున్నారు' అని నారా లోకేష్ ఆరోపించారు.
అటు గురువారం నాటి 55వ రోజు పాదయాత్రతో లోకేష్ మరో మైలురాయిని అధిగమించారు. గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన కియా కార్ల ఫ్యాక్టరీ ఎదుట సెల్ఫీ దిగారు.
కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులు, సిబ్బందితో నారా లోకేష్ మాట్లాడారు. కియా పరిశ్రమ ముందు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అమ్మనపల్లి వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించారు. గుట్టూరు హైవే సమీపంలో కుంచిటిగ వక్కలిగ సామాజిక వర్గీయులతో సమావేశమై.. వారి సమస్యలు తెలుసుకున్నారు. సీకేపల్లి పంచాయతీ కోన క్రాస్ వద్ద పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. లోకేష్‌కు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.