గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో బాహాబాహీ కొనసాగింది. ఈ సమావేశంలో.. వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో.. పలువురు కౌన్సిలర్ల చొక్కాలు చిరిగాయి. సభ్యులను ఎంత వారించినా.. వినకపోవడంతో.. సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఛైర్ పర్సన్ వెళ్లిపోయారు. అయితే.. కౌన్సిలర్ల తీరుపై తెనాలి పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా రచ్చకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెనాలిలో టెండర్ల కేటాయింపు విషయంపై ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. టెండర్లను అధికార పార్టీకి చెందిన వారికే కట్టబెడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనిపై వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. అదికాస్త కొట్టుకునే వరకు వచ్చింది. కౌన్సిలర్ల మధ్య జరిగిన గొడవతో.. పోలీసులు రంగంలోకి దిగారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సభ్యులతోనూ ఛైర్ పర్సన్ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.