కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్ అంటూ కియా పరిశ్రమపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. కియాపై జగన్ నాటి వ్యాఖ్యలు, లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్‌లను ప్రస్తావిస్తూ వీడియోలతో చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియాను తరిమేస్తాను అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను నిన్న యువగళంలో లోకేష్ విడుదల చేశారు. జగన్ చేసిన నాటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ Cకెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్ అంటూ ప్రశ్నించారు చంద్రబాబు.
వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మాట్లాడిన ఆ వీడియోలో 'ఈ ఒక్క సంవత్సరం ఆగండి.. ఆపే కార్యక్రమం చేద్దాం. ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేశారు. ఈలోపు ఎవరు చేసినా కూడా.. ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా ఆ ఫ్యాక్టరీని వెనక్కు పంపే కార్యక్రమం చేస్తాం' అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియోనే ఇప్పుడు ప్రస్తావించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా పెనుకొండ నియోజకవర్గంలో ఉన్న కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగి సెల్ఫీ దిగారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. 'ఆనాడు జగన్ అనంతపురం నుంచి తిరిగి వెళుతూ ఇది ఫేక్ అన్నారు. భూ దందా కోసం చేస్తున్నది అన్నారు. ఉద్యోగాలు రావన్నారు.. భూములు తిరిగి రైతులకు ఇస్తామన్నారు. ఇప్పుడు చెప్పండి.. ఇది ఫేకా.. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ఫేకా' అంటూ ప్రశ్నించారు.
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం వీడియోను లోకేష్ విడుదల చేశారు. జగన్ రైతులు ఎవరూ భూములు ఇవ్వొద్దని.. అండగా ఉంటానని చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వెనక్కి పంపి భూములను వెనక్కి ఇస్తానని అన్నారని.. ఇప్పుడు అక్కడే కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాక వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇంత చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారని చాలా బాధపడ్డాను అన్నారు. తాము సమర్థవంతంగా ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని.. అందుకే తమకు ఓటు వేయలేదమో అని వ్యాఖ్యానించారు. అందుకే తాను యువగళం పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను అన్నారు.