పుట్టపర్తిలో హైటెన్షన్ నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివారం సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అలెర్ట్ అయ్యి సత్తెమ్మ ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సవాళ్లలో భాగంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోలీసులను ఛేదించుకొని ఆలయ ఆవరణకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని టీడీపీ ఆఫీస్ వద్ద పోలీసులు నిర్బంధించారు. ఆయనను బయటకు రానివ్వకుండా..బయట వారు లోపలికి పోకుండా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీస్ వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. దీనితో ఇరువర్గాల వారు గాయపడగా..వాహనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అలాగే పుట్టపర్తిలో పోలీస్ యాక్ట్ 30ను అమలులోకి తెచ్చారు. చివరకు మాజీ మంత్రి పోలీసుల కళ్లు గప్పి సత్తెమ్మ ఆలయానికి చేరుకోవడం గమనార్హం. ఆయన కారుపైకి ఎక్కి వైసీపీ నేతలకు సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.