ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 09:50 PM

ఏపీలో ఒంటిపూట బడుల నిర్వాహణపై క్లారిటీ వచ్చేసింది. ఏపీలో స్కూల్ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ 3 నుంచి ఒంటిపూట బడులు మొదలవుతాయన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒంటి పూట బడుల నిర్వహణలో ఉపాధ్యాయులపై కక్ష ఎందుకు ఉంటుందని.. ఎండలు ఎక్కువైనందుకే సోమవారం‌ నుంచి హాఫ్ డే స్కూళ్లు మొదలవుతాయన్నారు. ఒంటిపూట బడులు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని.. ఎండల తీవ్రత లేదని ఇప్పటి వరకు ఒంటి పూట బడులు ఇవ్వలేదన్నారు. వాతావరణ శాఖ నివేదికలు ప్రతీ వారం తెప్పించుకున్నామని.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నామన్నారు. హాఫ్ డేలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు స్కూళ్లు జరుగుతాయి.


మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.. 18 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. మొత్తం 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం.. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌కు అనుమతి లేదు.


పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించామని.. స్మార్ట్ పరికరాలు కూడా ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదన్నారు మంత్రి. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుందన్నారు. కలెక్టర్, ఆర్డివో లాంటి ఉన్నతాధికారులు ప్రతీ రోజూ ఒక సెంటర్ ని తనిఖీలు చేస్తారన్నారు. గతేడాది పేపర్ లీకేజ్ అనుభవాలని దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్ లు ఏర్పాటు చేశామన్నారు.


నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలని అభివృద్ది చేశామన్నారు బొత్స. మూడు విడతలలో ఈ కార్యక్రమాన్ని‌ ఉద్యమంగా చేపట్టామని.. జూన్ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానమన్నారు. ఆరు నుంచి పదవ తరగతి విద్యార్ధులకి ఐఎఫ్ పి ప్యానెళ్లు అందుబాటులో ఉన్నాయని.. జగనన్న విద్యాకానుకలో నాణ్యతలో మార్పులు చేశామన్నారు. యూనిఫాంలని ఈ ఏడాది నుంచి చెక్స్ డిజైన్‌లో ఇస్తామన్నారు. షూ, బ్యాగ్ నాణ్యత కూడా పెంచామని.. స్కూలు బ్యాగ్ సైజ్ పెంచామన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్ధులకి నాణ్యమైన‌ పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు.. అదనంగా రాగిజావ కూడా విద్యార్దులకి అందిస్తున్నామన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాలలకి సీబీఎస్‌ఈ అనుమతులు వచ్చాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాఠశాల మూయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం.. ప్రైవేట్ కి‌ వ్యతిరేకం‌కాదన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ పరీక్షలలో లోపాలని మీడియా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్దులని, వారి తల్లితండ్రులని భయాందోళనలు కలిగించేలా తప్పుడు వార్తలు రాయొద్దని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa