సాలూరు మండలంలో గత రెండు రోజులుగా గాలులతో కూడిన వర్షాలు కురవడంతో వందల ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు ధ్వంసం అయ్యాయని, కావున నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం మండల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో టిడిపి మహిళా ప్రతినిధి డొంక అన్నపూర్ణ, మామిడిపల్లి మాజీ సర్పంచ్ బూస తవుడు తదితరులు మండలంలోని మామిడిపల్లి, మరిపల్లి, బూతాడ కర్రివలస తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పైగ్రామాలకు చెందిన పూజారి శ్రీను, జట్ల చిన్నారావు, నల్ల నాగరాజు, వెంకట్రావు తదితర రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వీరు విలేకరులతో మాట్లాడుతూ గత మూడేళ్లుగా రైతుల పట్ల ప్రకృతి కన్నెర్ర చేస్తున్నదన్నారు. రెండేళ్ల పాటు కరోనా కారణంగా పండిన పంటలను అమ్ముకోలేక పారబోసారని, గత ఏడాది ప్రకృతి కారణంగా అంతా నేలపాలు అయిందన్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఏర్పడిందని, మామిడిపల్లి, మరిపల్లి, మావుడి, కందులపదం, కురుకూటి, తోణాం తదితర పంచాయతీల్లో వందల ఎకరాల్లో అరటి , మొక్కజొన్న పంటలు నేలకు ఒరిగాయన్నారు. దీనితో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన చెందుతున్నారన్నారు. అరటి చెట్లు గెలలతో విరిగిపడ్డాయని, వెదురు కర్రలు కట్టినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. అలాగే మొక్కజొన్న పూర్తిగా నేలకు ఒరిగిందన్నారు. దీనితో రైతులు లక్షల్లో నష్టపోయారని, పంట చేతికి అంది వస్తుందనుకున్న సమయంలో అంతా ధ్వంసం అయ్యిందని, కావున నష్టపోయిన రైతులను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.