గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను మహిళలు కోరారు. 2024 ఎన్నికలకు ముందస్తు ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ గ్రామాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. గ్రామస్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మంత్రి సీతారామన్ చుట్టూ చేరి గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెటే నిర్ణయిస్తుందని చెప్పారు. ‘‘మన దేశంలో వంట గ్యాస్ లేదు. దీన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. కనుక అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిపోతే ఇక్కడ కూడా రేట్లు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి. కానీ, గత రెండేళ్లలో పెద్దగా తగ్గింది లేదు’’అని మంత్రి స్పష్టం చేశారు. ఒక విధంగా గ్యాస్ ధరల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని మంత్రి చెప్పారు.