మనదేశ అడవి జంతువులు కాపాడుకొనే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు అనారోగ్యం కారణంగా అవి అతరించిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చిరుత ఆదివారం తప్పించుకుంది. రక్షణ ప్రాంతం నుంచి బయటకొచ్చిన ఒబాన్ అనే చిరుత.దగ్గరలోని ఓ గ్రామంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. దీని గురించి సమాచారం అందుకున్న అధికారులు చిరుత ఉన్న ప్రాంతానికి చేరుకుని దానిని అడవుల్లోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘గో ఒబాన్.. దయచేసి వెళ్లు’ అని ఇంగ్లీషులో ఫారెస్ట్ సిబ్బంది చెప్పడం వీడియోలో వినబడుతోంది.
దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి వీటిని ప్రవేశపెట్టే ప్రాజెక్ట్‌కు 2020లో సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో తొలి విడతగా గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిలో సాశ అనే ఆడ చిరుత గత నెల అనారోగ్యంతో కన్నుమూసింది. ఇక, ఒబాన్ కునో జాతీయ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని విజయపూర్‌లోని జార్ బరోడా గ్రామంలోకి ప్రవేశించింది. ఒబాన్ బరోడా గ్రామంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్టు చీతా మెడకు అమర్చిన పరికరం ద్వారా గుర్తించామని అటవీ అధికారి తెలిపారు.
‘చిరుతలు అడవిలో పెద్ద పరిధిలో సంచరిస్తాయి.. ఆడ కంటే మగ చిరుతలు ఎక్కువ విస్తీర్ణంలో తిరుగుతాయి.. ఆశా కంటే ఒబాన్ పార్క్ దాటి వెళ్లడం చూశాం’ అని కునో ఫీల్డ్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ చెప్పారు. విజయ్‌పూర్‌లోని జార్ బరోడా గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను వెనక్కి రప్పించడానికి పర్యవేక్షణ బృందం కూడా గ్రామానికి చేరుకుందని, ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.