స్వేచ్చ కొత్తపుంతలు తొక్కుతున్నట్లుంది. సినిమాల ప్రభావంతో కొంత మంది అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో కురచ దుస్తులు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలకు అలాగే వస్తున్నారు. సంప్రదాయ వాదులకు అది కాస్త ఇబ్బందికరంగానే అనిపించినా.. ఆధునికవాదులు సమానత్వం, స్వేచ్ఛ అనే అంశాలను తెరపైకి తీసుకొస్తుండటంతో మౌనంగా ఉంటున్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువతి ఈ అడ్డుగోడలను మరింత చెరిపేసింది. ఏకంగా బికినీ వేసుకొని మెట్రో రైలు ఎక్కింది. చిన్న బ్రా, మినీ స్కర్టు వేసుకొని వచ్చింది. ఏదో వేసుకున్నామా అంటే వేసుకున్నాం అన్నట్టు ఆ దుస్తులు ఉన్నాయి. ఫ్యామిలీ పర్సన్స్‌కి వెగటు పుట్టించేలా ఉన్నాయి. ఢిల్లీ మెట్రో గర్ల్ పేరుతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి వేసుకున్న దుస్తుల మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో.. యువతి తన ఒడిలో లగేజీ బ్యాగ్‌ను ఉంచుకొని ప్రయాణీకుల మధ్య కూర్చొని ఉంది. ఆమె పైకి లేవగానే.. ఆమె దుస్తులు కనిపిస్తాయి. ఆమె చిన్న స్కర్టు, బ్రా మాత్రమే ధరించి కనిపిస్తుంది. ఆ దుస్తులు చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. బికినీ వేసుకోవడం తప్పా..? అని ప్రశ్నించేవారూ లేకపోవచ్చు. ఇక్కడ అది కాదు విషయం. బికినీ వేసుకొని ఆమె బీచ్‌కు రాలేదు. ప్రయాణీకులు.. అందులోనూ చిన్న పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించే మెట్రో రైల్లో బికినీ వేసుకొని కూర్చుంది. చూసేందుకు అది చాలా మందికి అసభ్యకరంగా ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.