సోషల్ మీడియాలో స్టార్ ఐపోవాలన్న తపనతో కొందరు దేనికైనా తెగబడుతున్నారు. భయానక వీడియోల చిత్రీకరణ కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. ఒళ్లు గగుర్పొడిచే మ్యూజిక్ బిట్స్ జత చేసి, లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. ఈ వీడియోల చివర్లో మాత్రం ఓ మంచి సందేశం ఇస్తున్నట్లు నటిస్తున్నారు. ఇటువంటి దారుణాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఈ వీడియోలను తొలగించాలని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కోరుతామని పోలీసులు తెలిపారు. కారు ప్రాంక్ వీడియోల్లో మైనర్లకు ( ఎక్కువ శాతం మందిఅబ్బాయిలే) లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు బెదిరిస్తున్నారు. చాలా కేసుల్లో ఆ చిన్నారి భయంతో వణికిపోతూ, కారు డోర్‌ను తెరచి, కిందకు దూకేయడానికి ప్రయత్నిస్తుండగా, అడ్డుకుని, సిరంజిలతో బెదిరించడం.. ఈ దృశ్యాలను కారులోనే ముందుగా అమర్చిన కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. అనంతరం భయంకరమైన మ్యూజిక్ ట్యూన్ జత చేసి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇటువంటి వీడియోలకు యూట్యూబ్‌లో దాదాపు 5 లక్షల వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 60 లక్షల వ్యూస్ వస్తున్నాయి.
ఇంతటి దారుణంగా వీడియోలను చిత్రీకరించి, చివర్లో మాత్రం ‘పరిచయం లేని వ్యక్తులను లిఫ్ట్ అడగవద్దు’ వంటి సందేశాలను ఇస్తున్నారు. ఈ రీల్స్ చేయడానికి ముందు ఆ చిన్నారుల తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటున్నారో? లేదో మాత్రం చెప్పడం లేదు. ఐటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూట్యూబ్ నుంచి తొలగించిన ‘రైడర్ సల్మాన్’ అనే ఛానల్ చిత్రీకరించి వీడియోలో డ్రైవర్.. దాదాపు 12 ఏళ్ల వయస్సు ఉన్న బాలుడికి లిఫ్ట్ ఇచ్చి, ఎవరికో ఫోన్ చేసి అబ్బాయి దొరికాడని, క్షేమంగా ఉన్నాడని చెబుతాడు.
వెనుక సీటులో కూర్చున్న డ్రైవర్ స్నేహితులు సిరంజిని బయటకు తీయడంతో భయపడిన పిల్లావాడు కారు ఆపమని వేడుకోవడం.. సహాయం కోసం అరుస్తూ కదులుతున్న వాహనం నుంచి దూకడానికి ప్రయత్నిస్తాడు. దీనిని యూట్యూబ్ నుంచి తొలగించినా క్లిప్పింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశీలనలో 50,000 నుంచి 5 లక్షల వరకు వ్యూస్ ఉన్న ఇలాంటి 15 కంటే ఎక్కువ వీడియోలు బయటపడ్డాయి.అయితే, వ్లాగర్స్ రెచ్చిపోవడానికి ప్రేక్షకులు కూడా కారణం. మైనర్లతో భయానక వీడియోలు చేసే ఛానల్స్‌కు సబ్‌స్క్రైబర్లు క్షణాల్లో పెరుగుతున్నారు. ఇటువంటి హింసాత్మక వీడియోలను చూడటం సరైనది కాదని, ప్రోత్సహించకూడదని గుర్తించాలి.