ఇపుడు చెట్లతో కూడా మనిషి భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. వృక్షాల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారిగా మనిషికి సోకింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కేసు భారత్‌లోనే నమోదైంది. కోల్‌కతాలో 61 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. గత 3 నెలలుగా ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన శిలింధ్రాలపై పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా వృక్షాలను తాకినప్పుడు వాటి నుంచి ఈ అరుదైన శిలీంధ్రం అతడి శరీరంలో ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ఆహారం మింగడంలో ఆయన తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. దీంతో పాటు గొంతు బొంగురుపోవడం, దగ్గు, అలసట, ఆకలి మందగించడం లాంటి లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. మూడు నెలల కిందట ఈ లక్షణాలతో కోల్‌కతాలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. పరీక్షల అనంతరం.. వృక్షాల్లో వ్యాధులకు కారణమయ్యే శిలీంధ్రం సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు.దీన్ని ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్’ శిలీంధ్రంగా వైద్యులు గుర్తించారు. వృక్షాల్లో ఇది ‘సిల్వర్ లీఫ్’ వ్యాధికి కారణమవుతుందని తెలిపారు. పరిశోధకుడికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ కేసుకు సంబంధించి వివరాలను తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఆయనకు షుగర్, హెచ్‌ఐవీ, శ్వాస సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులేవీ లేవని వైద్యులు తెలిపారు. ప్లాంట్ మైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన కొన్నేళ్లుగా కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పరిశోధనలు చేస్తున్నారు. కుళ్లిపోతున్న పదార్థాలతో పని చేయడమే ఈ అరుదైన సంక్రమణకు కారణం అయుండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.