మత ఉద్రిక్తలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా తలెత్తిన ఘర్షణలు రాష్ట్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం హుగ్లీలో బీజేపీ నిర్వహించిన శోభాయాత్రపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ నిర్వహించిన శోభాయాత్రలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా రాళ్లు విసిరారని ఘోష్ ఆరోపించారు. గత నెల 30న శ్రీరామనవమి సందర్భంగా హావ్‌రాలో భారీయెత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే.
తాజా ఘటనతో హుగ్లీలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాళ్ల దాడి నుంచి తప్పించుకోడానికి జనం భయంతో పరుగులు పెడుతుండటం వీడియోల్లో కనిపిస్తోంది. వాస్తవానికి అనుమతించిన సమయానికి కంటే ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భారీ డీజే శబ్దాలతో పాటు ఓ మసీదు ముందు కొందరు కత్తులు పట్టుకుని విన్యాసాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మసీదుపై దాడికి కొందరు ప్రయత్నిస్తున్నారనే ప్రచారంతో హింస చెలరేగినట్టు తెలిపాయి.