చైనా తీరును తొలినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న అమెరిాకా తాజాగా భారత్ కు బాసటగా నిలిచేలా ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడం పట్ల అమెరికా కూడా స్పందించింది. చైనా చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. వాస్తవిక పరిస్థితులను మార్చలేరంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం సైతం దీనిపై స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా అమెరికా గుర్తించిందని.. ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టడం ద్వారా వాటిపై హక్కులను క్లెయిమ్ చేసేందుకు ఉద్దేశించిన ఏక పక్ష చర్యలను ఆమోదించబోమని అధ్యక్ష కార్యాలయం ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పీరే ప్రకటన విడుదల చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా చైనా పేర్కొంటోంది. కొత్త పేర్లు పెట్టిన వాటిల్లో పర్వత శిఖరాలు, నదులు, నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. భారత్ లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించడం 2017 ఏప్రిల్ తర్వాత ఇది మూడోసారి కావడం గమనార్హం.
చైనా ఈ తరహా చర్యలకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదని భారత్ సైతం పేర్కొంది. ‘‘అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగా, విడదీయలేని భాగంగా ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన పేర్లను పెట్టడం ద్వారా వాస్తవ పరిస్థితులను మార్చలేరు’’ అని తేల్చి చెప్పింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే. అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ తరుణంలో చైనా తన తాజా చర్యతో ద్వైపాక్షిక ఉద్రిక్తతలను మరింత పెంచేలా వ్యవహరించింది.