తన పట్ల కాంగ్రెస్ పార్టీ కంటే మోదీనే ఎక్కువ ఉదారతను ప్రదర్శించారని కాంగ్రెస్ మాజీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ చెప్పారు. తాను ఏనాడూ కూడా మోదీ ఇచ్చిన విందు సమావేశాలకు హాజరు కాలేదని... అయినా ఆయన తన పట్ల ఉదారంగా వ్యవహరించారని తెలిపారు. లోక్ సభలో విపక్ష నేతగా తాను మోదీని విమర్శిస్తూ ప్రసంగాలు చేశానని... అయినా ఆయన అవేమీ పట్టించుకోకుండా, తన పట్ల గొప్పగా వ్యవహరించారని కొనియాడారు. మోదీ గొప్ప స్టేట్స్ మెన్ అని కితాబిచ్చారు.
దివంగత ప్రధాని వాజ్ పేయితో కూడా తనకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని ఆజాద్ చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో సంజయ్ గాంధీ కేవలం 15 నిమిషాలు మాత్రమే బడ్జెట్ గురించి మాట్లాడేవారని, మిగతా సమయమంతా వాజ్ పేయికి వ్యతిరేకంగా మాట్లాడేవారని... కానీ, సంజయ్ గాంధీకి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడనని వాజ్ పేయి చెప్పేవారని తెలిపారు. సంజయ్ గాంధీతో పాటు మీ ఇతర సహచరుల వల్లే మీరు ప్రధాని అయ్యారని ఇందిగాంధీతో వాజ్ పేయి చెప్పే వారని వెల్లడించారు. ఇందిరాగాంధీ నాయకత్వ లక్షణాలు సంజయ్ గాంధీలో ఉన్నాయని... ఆయనకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడనని చెప్పారు.
మరోవైపు ఆజాద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పార్టీలో ఉన్నంత కాలం ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియాలు ఎన్నో పదవులను అనుభవించారని, అలాంటి పార్టీని ఇప్పుడు విమర్శిస్తున్నారని దుయ్యబట్టింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆజాద్ సొంతంగా డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు.