ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సొంత పార్టీలో అసమ్మతి మొదలైంది. పెనుమూరు మండలానికి చెందిన ఆయన వ్యతిరేక వర్గం సమావేశమై ఘాటుగా విమర్శలు చేశారు. నారాయణస్వామి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎవరిని అడిగి మండల పార్టీ కన్వీనర్లను మార్చేశారని ప్రశ్నించారు. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఆహ్వానించడం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నారాయణస్వామి నియమించిన కన్వీనర్లను అంగీకరించేది లేదన్నారు. వైఎస్ జగన్ కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే.. నారాయణస్వామి అధికారులు, పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. అసమ్మతి వర్గం తీరుపై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధికి పనిచేయనివారు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని.. సొంత పార్టీకి నష్టం చేసేవాళ్లను వదిలేసే ప్రసక్తేలేదన్నారు. జగనన్న తనకు ప్రత్యక్ష దైవమని.. ఆత్మాభిమానం చంపుకొని వ్యవహరించను అన్నారు. పెనుమూరు మండలంలో కొందరు సొంత పార్టీ నాయకులే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వాటిని సహించేదిలేదని హెచ్చరించారు.
కొందరు భూ ఆక్రమణదారులకు నోటీసులు అందాయని.. తప్పు చేయకుంటే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలన్నారు డిప్యూటీ సీఎం. తనను విమర్శించడం సరికాదని.. కార్వేటినగరంలో మాజీ ఎమ్మెల్యే ఈవీ గోపాలరాజు కుటుంబానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడినవారికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు నారాయణ స్వామికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని పరిణామం ఎదురైంది. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు కార్వేటినగరం పంచాయతీలో పర్యటించారు. నాలుగేళ్లుగా డీఎస్సీ నిర్వహించలేదని.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని.. జాబ్ క్యాలెండర్ ఏమైందని విజయమాంబపురానికి చెందిన యువకులు నారాయణస్వామిని ప్రశ్నించారు. అలాగే పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని కొందరు మహిళలు ఆరోపించారు. రోడ్లు, డ్రైనేజీతో పాటూ ఇతర సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తాము సమస్యలపై ప్రశ్నిస్తే డిప్యూటీ సీఎం తమను టీడీపీ వాళ్లని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.ఆ తర్వాత స్థానికులతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సమావేశం నిర్వహించి గ్రామంలో సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.