రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదేశాలతో పోలీసులు ఓ కాలేజీ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా బుధవారం అనకాపల్లి ఉడ్‌పేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. సమీపంలోని డీవీఎన్ కళాశాల (వైసీపీకి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు చెందినది) బాల్కనీ నుంచి కొందరు విద్యార్థులు వినసాగారు. ఆ సమయంలో ఒక విద్యార్థి ‘జై జనసేన’ అని నినదించారు. అది మంత్రి చెవిన పడడంతో ప్రసంగాన్ని ఆపి అక్కడే ఉన్న ఎస్‌ఐ దివాకర్‌ను పిలిచి ఎవరో చూడండని చెప్పారు. దీంతో ఎస్‌ఐ కాలేజీలోకి వెళ్లారు. ఆయన వెంట కొందరు వైసీపీ నాయకులు కూడా ప్రవేశించారు. ఎస్‌ఐ నేరుగా మూడో అంతస్థులోకి వెళ్లి అక్కడున్న నలుగురు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి.. ఒకరి కాలర్ పట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలోకి ఎస్‌ఐ ప్రవేశించిన విషయం తెలుసుకున్న దాడి వీరభద్రరావు, ఆయన తనయులు రత్నాకర్, జయవీర్ హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కాలేజీ చైర్మన్, వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు రత్నాకర్ మీడియాతో మాట్లాడారు. తమ కళాశాల విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పట్టణ ఎస్‌ఐ డి.దివాకర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలోకి వచ్చి ఎటువంటి విచారణ లేకుండా విద్యార్థులపై ఎస్‌ఐ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.