చిరుతల మిస్సింగ్ అంశం కునో నేషనల్ పార్కు అధికార్లకు తలనొప్పిగా మారింది. నాలుగు రోజుల కిందట మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి నమీబియా నుంచి తీసుకొచ్చిన ఒబాన్ అనే చిరుత తప్పించుకున్న విషయం తెలిసిందే. రక్షణ ప్రాంతం దాటి వచ్చిన చిరుతను వెనక్కి రప్పించడానికి ఫారెస్ట్ అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా, ఆశా అనే ఆడ చిరుత కూడా పార్కు నుంచి తప్పించుకోవడంతో అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఒబాన్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, మరో చిరుత రక్షణ ప్రాంతం నుంచి బయటకు రావడంతో అధికారులు ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు.
ఒబాన్, ఆశా జంటను మార్చి 11న అడవిలోకి విడుదల చేశారు. ఇది ట్రాన్స్‌లోకేషన్ ప్రక్రియ చివరి దశ. కానీ, అనూహ్యంగా గత ఆదివారం ఒబాన్ రక్షణ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసింది. కునో చుట్టుపక్కల గ్రామాలలో దాని యాత్రను కొనసాగిస్తుండగా.. తాజాగా, ఆశా కూడా తన ప్రియుడ్ని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. గత సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి తన నివాసంగా ఉన్న అభయారణ్యం నుంచి ఆశా బయటకు వెళ్లిపోయిందని అటవీ సిబ్బంది పేర్కొన్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీర్‌పూర్ ప్రాంతంలోని బఫర్‌జోన్‌లో నదుల వెంబడి ఆశా సంచరిస్తున్నట్టు తన మెడలో ఉన్న జియో ట్యాగింగ్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు దానిని పట్టుకునే పనిలో పడ్డారు. మరోవైపు, తప్పించుకున్న చిరుత బఫర్‌జోన్‌లో సంచరిస్తుందని తెలిసి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చిరుతలు జనావాసాల్లోకి రావని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా నిర్దేశిత ప్రాంతం దాటి చిరుతలు బయటకు వెళ్తుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్లిన ఒబాన్ మానవ ఆవాసాల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే దానికి బాణం ద్వారా మత్తు మందు ఇవ్వాలని ప్రాజెక్ట్ చిరుత బృందం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గురువారం సాయంత్రంలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఒబాన్ కునో నుంచి 4 కి.మీ దూరంలో ఉందని, వెనక్కి రప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ముందు కదులుతూనే ఉంది. ఒబాన్ అభయారణ్యం దాటి వెళ్తూన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రాజెక్ట్ చిరుత బృందం గతంలో కారిడార్‌ను నిర్మించడం ద్వారా వాహనాలను ఉపయోగించడం ద్వారా తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతల్లో సాషా అనే ఆడ చిరుత అనారోగ్యం కారణంగా గత నెలలో మృతి చెందింది.