జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పెద్దలను కలిశారని.. అయితే దీనిపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైరయ్యారు. ఈ మేరకు గురువారం ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని చెప్పారన్నారు.
రాష్ట్ర ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పిస్తామని, ఇందులో భాగంగానే సమావేశాలు జరిపామని, ప్రతిపక్షాల ఓటు చిలనివ్వనని పవన్ కళ్యాణ్ తన మనసులో మాట స్పష్టంగా చెప్పారన్నారు. ఏపీలో దుష్టపాలన అంతం చేయాలంటే అందరం కలిసి పోరాటం చేయాలని పవన్ చెప్పారని రఘురామ అన్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉందని, కేంద్రంలో ఉన్న బీజేపీనే టీడీపీ, జనసేనను కలుపుతుందనే నమ్మకం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. ఆ మూడు పార్టీలు కలిస్తే వైసీపీ వాళ్లకు ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారని రఘురామ వెల్లడించారు. ప్రధానితో జరిగిన చర్చల అంశాన్ని మాత్రమే ఎంపీ కనకమేడల చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా పంజాబ్ రాష్ట్రం మాదిరిగా మారిందని, శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారని రఘురామ అన్నారు.