నేటి నుంచి జగన్ ప్రభుత్వ అరాచకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఏడాది కాలం పాటు ప్రజల మధ్యే తిరగాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. టీడీపీ నాలుగో జోన్ (ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు) పరిధిలోని 35 నియోజకవర్గాలన్నిటిలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేలా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ‘జగన్ ప్రజల బిడ్డ కాదు.. రాష్ట్రానికి పుట్టిన కేన్సర్ గడ్డ. కేన్సర్ గడ్డ చిన్నదైనా పెద్దదైనా వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే. లేదంటే రాష్ట్రం సర్వనాశనమవుతుంది’ అని స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన నాలుగో జోన్ సమీక్ష సమావేశంలో.. రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతిరూపమైన జీసస్ దీవెనలు వారికి ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ కళ్లు ఇప్పుడిప్పుడే భూమ్మీదకు దిగుతున్నాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. ప్రజ లు ఆయన్ను ఇంకా కిందకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నాలుగేళ్ల జగన్ పాలనలో ఏ వర్గమూ బాగుపడలేదన్నారు. మీ జీవితాలు బాగుపడ్డాయో.. ముందు కన్నా హీనంగా తయారయ్యాయో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.