ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అరుణ్ సింగ్ సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... . ‘‘కాంగ్రెస్ పార్టీతో మా కుటుంబం ప్రయాణం 1952లో మొదలైంది. పార్టీని వీడుతానని ఎప్పుడూ ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇది నా రెండో రాజీనామా. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఒకసారి పార్టీకి రాజీనామా చేసి నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ పార్టీలో చేరాను. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ క్షీణిస్తోంది. వారు ప్రజలతో కలవరు, నేతల అభిప్రాయాలు తీసుకోరు. అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీని కొన్ని సమావేశాలలో కలిశాను. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో దేశంలో అవినీతి తగ్గింది. అందుకే మోదీ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరాను. ఎలాంటి బాధ్యత అప్పగించినా బీజేపీ బలోపేతం కోసం కృషిచేస్తాను’’ అని కిరణ్ అన్నారు.