తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. దీంతో కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్ వెలుపలకి వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల అనూహ్య రద్దీతో గదులకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. గదుల కోసం గంటల కొద్దీ సమయం భక్తులు నిరీక్షిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోగా క్యూలైన్ నారాయణగిరి కాటేజీలు, శిలాతోరణం మీదుగా గోగర్భం డ్యాం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దాకా వ్యాపించింది. పరిమిత సంఖ్యలోనే గదులున్న నేపథ్యంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి.